అయోధ్య రామ మందిరం.. హిందూవుల దశాబ్దాల కల. రామయ్య ఏలిన ఈ పుణ్య ప్రదేశంలో వందల ఏళ్ల ఎదురుచూపుల తర్వాత.. దివ్యభవ్య ఆలయం కొలువుదీరింది. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగే ఈ వేడుక అంగరంగ వైభవంగా ముగిసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య గురించి, రామ మందిర విశేషాలు, పోరాటాల గురించి ‘రాష్ట్ర’ వరుస కథనాలు ఇస్తోంది.
అయోధ్య చరిత్ర ఇదే!
రామయ్య పూర్వీకులైన ఆయుథ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందూవులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువు 9 వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరాన్ని స్థాపించినట్టు అంటుంటారు. ఇక్ష్వాకులు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణాల్లో ఉంది. అలాగే, ఈ వంశానికి చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు.
సత్యవాక్ పరిపాలకుడు హరిశ్చంద్రుడు సూర్య వంశపు 31వ రాజు. గంగను భువికి దించిన భగీరధుడు, అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘు మహారాజుల కీర్తి చాలా ప్రత్యేకం. రఘు మహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్య వంశపు 63వ రాజు దశరథుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరథుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు.
అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరిత మానస్ వంటి అనేక పురాణ గ్రంథాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి, సుందరి, పాడలిప్తసూరీశ్వరి, హరిచంద్ర, అచల భరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించారు. హిందూవులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ముఖ్య నగరం. 2వేల సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మత తీర్ధంకులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది. హిందూ, జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు నిర్మించారు.
ఎంతో గొప్ప చరిత్ర కలిగిన అయోధ్యలో అనేక పోరాటాల తర్వాత రామ మందిరం కొలువైంది. ఈ ఆలయ ఏర్పాటుకు ముందు ఏం జరిగింది, మందిర నిర్మాణ విశేషాలను ‘రాష్ట్ర’ వరుస కథనాల ద్వారా అందిస్తోంది. అయోధ్య రామ మందిర స్థల వివాదం ఏంటి..? గతంలో ఏం జరిగిందనేది తర్వాతి కథనంలో చూద్దాం.