Telugu News » Holi in Nijamabad: వింత ఆచారం.. పిడిగుద్దులతో హోలీ..!!

Holi in Nijamabad: వింత ఆచారం.. పిడిగుద్దులతో హోలీ..!!

ఓ గ్రామంలో మాత్రం పిడిగుద్దులతో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఆట దెబ్బలు తగిలినా త్వరలోనే మానిపోతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు.

by Mano
Holi in Nijamabad: Strange ritual.. Holi with fists..!!

సాధారణంగా హోలీ పండుగ(Holi Festival) అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకోవడం, ఆలింగనం చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఓ గ్రామంలో మాత్రం పిడిగుద్దులతో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఆట దెబ్బలు తగిలినా త్వరలోనే మానిపోతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అంతేకాదు.. అనాదిగా వస్తున్న తమ ఆచారాన్ని పాటించకుంటే గ్రామానికే అరిష్టమని నమ్ముతున్నారు.

Holi in Nijamabad: Strange ritual.. Holi with fists..!!

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా(Nijamabad Dist) సాలూర మండలం హున్సాలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ ఏటా పిడిగుద్దులతో హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండుగ రోజు ముందుగా గ్రామ చావిడి వద్ద గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోతారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. డప్పు వాయిద్యాల నడుమ ఊరి పెద్దలను చావడి వద్దకు తీసుకొస్తారు. చావిడికి ఇరువైపులా బలమైన కర్రలు పాతి వాటి మధ్య తాడు కడతారు.

గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి మధ్యలో తాడు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రంగులు చల్లుకుంటారు. ఈ తంతు 15 నుంచి 30 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు చెబుతారు. పిల్లలు, వృద్ధులు కూడా ఈ ఆటలో పాల్గొనడం విశేషం. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలు, జాతర నిర్వహిస్తారు.

అయితే గ్రామస్తులు పండుగ పిడిగుద్దుల ఆటలకు పోలీసులు అనుమతి లేదంటున్నారు. గ్రామస్తులు మాత్రం వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి హానీ కలగదని, ఐక్యమత్యంతోనే పిడిగుద్దులాట కొనసాగిస్తామని అంటున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకుంటే గ్రామానికే అరిష్టమని చెప్పారు. ఓ సారి ఇలాగే తమ ఆచారాన్ని పాటించకపోవడంతో తమ గ్రామంలో వాటర్ ట్యాంక్ కూలిపోయిందన్నారు. దీంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి.

You may also like

Leave a Comment