ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి ఒక్క చిన్న మత ఘర్షణ కూడా జరగలేదని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. వక్ఫ్ భూములు ఆక్రమణలు బీఆర్ఎస్ (BRS) పాలనలోనే జరిగాయని ఆరోపిస్తున్న మహబూబ్ అలం పెద్ద కబ్జాకోరు అని మహమూద్ అలీ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మహమూద్ అలీ.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల పై స్పందించారు.
నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ పంచన ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ (Congress) నాయకులతో చేరి, మైనార్టీ వర్గాన్ని దేవుడిలా కాపాడుతున్న కేసీఆర్ (KCR)పై ఆరోపణలు చేయడం సైతాన్ రాజకీయాలకు నిదర్శనం అని విమర్శించిన మహమూద్ అలీ.. తన తల తెగిపడినా బీజేపీ (BJP)కి సపోర్టు చేయనని వెల్లడించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ వక్ఫ్ భూములను కాపాడేందుకు 22/A జీవోను తీసుకొచ్చి భూముల పరిరక్షణకు అండగా నిలిచారని తెలిపారు.
మోసకారి అయిన రేవంత్రెడ్డి మాటలు విని.. బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన తనానికి నిదర్శనమన్న మహమూద్ అలీ.. రేవంత్ గెలిచింది లేదు.. సచ్చింది లేదు.. అతను ఇస్తానన్న ఎమ్మెల్సీలకు ఆశపడి బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల్లోని అందరి కోసం షాదీముబారక్ తీసుకొచ్చిన కేసీఆర్.. వేలాది మంది పేద బిడ్డల పెళ్లిళ్లు చేశారని.. ఆసరా పింఛన్లు, ఇమామ్, మౌజాంలకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలియచేసారు.
రైతుబంధు, రైతు బీమా ముస్లి రైతులకు సైతం ఇచ్చి ధీమా పెంచినట్లు మహమూద్ అలీ (Mahmood-Ali) వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎంలు మంచి స్నేహితులు మాత్రమేనని, కూటమి మాత్రం కాదన్న మహమూద్ అలీ.. ముస్లిం మైనార్టీ సోదరులు 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను, 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనను చూసి, ఆలోచించి ఓటు వేయాలని కోరారు..