పౌరసత్వ సవరణ ఛట్ఠం-2019 కు సంబంధించిన నిబంధనలను దాదాపు సవరించేందుకు ఉద్దేశించిన గడువును మళ్ళీ పొడిగించాలని హోమ్ మంత్రిత్వ శాఖ కోరింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు సంబంధించి పౌరసత్వ చట్టాన్ని నాలుగేళ్లక్రితం పార్లమెంటులో ఆమోదించారని, కానీ అది ఇప్పటికీ అమలు కాలేదని ఈ శాఖ పేర్కొంది. అందువల్లే సీఏఏ రూల్స్ ని కొత్తగా ఫ్రేమ్ చేసేందుకు గల గడువును సెప్టెంబరు వరకు పొడిగించాలని కోరుతూ లోక్ సభలో సబార్డినేట్ లెజిస్లేషన్ పై గల పార్లమెంటరీ కమిటీకి ఈ శాఖ లేఖ రాసింది.
ఇందుకు కమిటీ అంగీకరించిందని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం ఇలా పొడిగింపును కోరడం ఇది ఎనిమిదో సారి. లోగడ ఈ డెడ్ లైన్ ని జూన్ 30 వరకు పొడిగించారు. ఈ చట్టాన్ని 2019 డిసెంబరు 11 న పార్లమెంటులో ఆమోదించారని, 2020 జనవరి 10 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారని హోమ్ శాఖ గుర్తు చేసింది.
చట్టాన్ని ఆమోదించిన ఆరు నెలల్లోగా గవర్నింగ్ రూల్స్ ని సంబంధిత శాఖ ఫ్రేమ్ చేయలేకపోయిన పక్షంలో..గడువును పొడిగించాలని ఈ కమిటీని కోరవచ్చునని పార్లమెంటరీ మ్యాన్యుయల్ వర్క్ స్పష్టం చేస్తోంది. 2014 డిసెంబరు 31 కి ముందు పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు, సిక్కులు, పార్సీలు, బుద్ధిస్టులు, జైనులకు పౌరసత్వం ఇవ్వాలని సీఏఏ కోరుతోంది.
ఈశాన్య రాష్టాల్లో చాలా ప్రాంతాలను సీఏఏ నుంచి మినహాయించారు. అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్ లో చేర్చారు. అయితే మిజోరం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలను సీఏఏ నుంచి మినహాయించారు. సీఏఏ ని ఆమోదించిన తరువాత దీనికి నిరసనగా 2019 డిసెంబరు-2020 మార్చి మధ్య కాలంలో అసోం, యూపీ, కర్ణాటక, మేఘాలయ, ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 83 మంది మరణించారు.