Honey Trap : యుద్ధం నేరుగా కాకుండా సోషల్ మీడియా ద్వారా జరిపితే శత్రు దేశంమీద దెబ్బ కొట్టవచ్చు. ఇందుకు అందమైన అమ్మాయిని వినియోగించుకుంటే శత్రు దేశ రక్షణ రహస్యాలు ఇట్టే తెలుస్తాయి. రక్షణ సంస్థలో పని చేసే ఉద్యోగికి ఎరగా అమ్మాయిని వేస్తే దాని ఫలితం చాలా వేగంగా అందుతుంది. అందుకే దాయాది దేశం పాకిస్తాన్ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. భారత్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లోని కీలక రహస్యాలను ఆ దేశం రాబట్టింది. దీన్నే హానీ ట్రాప్ అని కూడా అంటున్నాం
. విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పని చేసే కపిల్ కుమార్ జగదీశ్ భాయ్ మురారీ కథనే తీసుకుంటే.. లోగడ ఈయన రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పని చేశాడు. ఈ విషయం పాక్ ఐఎస్ఐకి ఎలా తెలిసిందో గానీ .. ఇతడి ద్వారా ఈ సంస్థలోని సమాచారాన్ని తెలుసుకోవాలని పనిలోకి దిగింది. ఓ టెర్రరిస్టు సంస్థ లీడర్ కి పీఏ అయిన తమీషా అనే యువతిని రంగంలోకి దింపింది.
సోషల్ మీడియా ద్వారా ఈమె కపిల్ తో పరిచయం పెంచుకుని కథ నడిపించింది. తన న్యూడ్ వీడియోలు అతనికి పంపడం, హస్క్ వాయిస్ తో అతడ్ని బుట్టలో పడేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అయింది. ఈ హానీ ట్రాప్ వల సక్సెస్ అయింది. రెండేళ్లుగా ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లోని ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది.
కానీ నిజం ఎంతో కాలం దాగదన్న నానుడి ఉంది. కపిల్ కదలికలకపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టారు. అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజం బయటపడింది. కపిల్ మొబైల్ ని స్వాధీనం చేసుకుని దాన్ని సిఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అధికారిక రహస్యాల చట్ట ఉల్లంఘన నేరం కింద అతనిపై కేసు నమోదు చేశారు.