పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే బీఆర్ఎస్ (BRS).. కాంగ్రెస్ (Congress) నేతలు బిజీ బిజీగా ఉంటున్నారు.. బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురు కాగా.. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) చక్రం తిప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.. అయితే ఈసారి గులాబీ అధిష్టానం తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నేతలు చేయి జారిపోకుండా ముందు జాగ్రత్తగా పడుతోన్నట్టు తెలుస్తోంది.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్ ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్స్, నేతల ప్రవర్తన కారణమనే వాదన వినిపిస్తోంది. అందులో టీఆర్ఎస్ ని కాదని బీఆర్ఎస్ అని పార్టీ పేరు మార్చడం కూడా ఒక కారణంగా తెలుపుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో.. పాలన సాగుతోందని భావించి ప్రజలు గులాబీ బాస్ మాటలకి లొంగలేదనేది కూడా తెలుస్తోందని అనుకొంటున్నారు.
అయితే మూడో సారి కేసీఆర్ సీఎం కావాలని ఆశించిన.. జనం మాత్రం కేసీఆర్ వద్దు.. రేవంత్ రెడ్డి ముద్దు అని తీర్పు ఇచ్చారు. ఈ పరిణామాన్ని ఇంకా గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఇందులోనూ బీఆర్ఎస్ ప్రభావం చూపించకపోతే పార్టీ మనుగడపై ప్రభావం పడుతుందని అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాల ప్రకారం జరుగుతాయి. ప్రధానిగా మోదీ ఉండాలా లేకపోతే కాంగ్రెస్ కూటమి నుంచి ఎవరైనా ఉండాలా అన్నది ఓటర్లు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ అటు ఎన్డీఏలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేదు. ఇక బీఆర్ఎస్ కి లోక్ సభ సీట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటీ అని ఆలోచించడం మొదలుపెడితే.. మొదటికే మోసం వస్తుందని అనుకొంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మోదీ ఇమేజ్ తోడవుతుంది. కాంగ్రెస్ కు అధికార పార్టీ ఇమేజ్ ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోవడానికే ఎక్కువ అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన.. అయితే సిద్దిపేట బలంతో ఒక్క మెదక్ లోక్ సభ నియోజకవర్గం మాత్రమే ఆశావహంగా కనిపిస్తోంది. మిగతా దేనిపైనా నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకే బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన ప్రారంభమైనట్టు ప్రచారం జరుగుతోంది..