మీకు ఇంకా ఓటర్ స్లిప్ (Voter Slip) రాలేదా.. అయితే చింత ఏమిలేదంటున్నారు అధికారులు.. ఓటు స్లిప్ అందని ఓటర్లు నేరుగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదెలాగో క్లియర్ గా వివరించారు.. ముందుగా www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ అడిగిన సమాచారాన్ని అందించాలి. దీంతో వెంటనే ఓటరు వివరాలు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ సమయం, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలు డిస్‌ప్లే అవుతాయని అధికారులు తెలుపుతున్నారు..
కాగా ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ సాయంతో ఓటరు స్లిప్పును పొందొచ్చని.. ఈ స్లిప్‌ను ప్రింట్ తీసుకుంటే సరిపోతుందని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్‌లైన్ (Online)ద్వారా, మొబైల్ యాప్ (Mobile App) హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ (SMS) ద్వారా కూడా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.
ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అదే పోలింగ్ కేంద్రంలో పేరు ఉన్నట్లయితే గుర్తింపు కార్డును చూపి ఓటేయవచ్చు. మరోవైపు ఓటర్ కార్డ్ సమయానికి దగ్గర లేకుంటే.. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు..
ఇక పోలింగ్ కేంద్రం, సమయం తదితర వివరాలన్నీ పొందడానికి ప్లేస్టోర్ నుంచి ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యాప్ సాయంతో ఓటరు కార్డుపై ఉండే క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే మీ వివరాలు కనిపిస్తాయని అధికారులు అంటున్నారు. అప్పుడు వీటితోపాటు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుని ఓటు వేయవచ్చని తెలుపుతున్నారు..