తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో భారీగా డబ్భుల కట్టలు పట్టుబడుతున్నాయి. డబ్బుల విషయంలో అధికారులు, పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేసినా కూడా పెద్ద మొత్తంలో డబ్బుతో ప్రయాణిస్తూ దొరికిపోతున్నారు. మరోవైపు ఎన్నికల నేపధ్యంలో ప్రతి చోట పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఓటర్లను మచ్చిక చేసుకోవడాని డబ్బు, మద్యం పంచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా డబ్బులు పట్టుబడడం ఆగడం లేదు. ఇక శనివారం ఉదయం బంజారాహిల్స్ Banjara Hills)లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు రూ. 3.50 కోట్లు పట్టుబడ్డాయి.. ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి (Mahesh Reddy) కారులో రూ. 3.50 కోట్లు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.
కాగా నగదుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆ డబ్బులు అప్పగించారు. మరోవైపు మహేశ్ రెడ్డి పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఏ పార్టీ కోసం మహేష్ రెడ్డి డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరాతీసే పనిలోపడ్డారు.