కేసీఆర్ (KCR)కు మరోషాక్ తగిలింది. ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావు (Kalvakuntla Kanna Rao)ను ఆదిభట్ల ( Adibhatla) పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. కాగా గతంలో భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు కన్నారావు కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు (High Court) డిస్మిస్ చేసింది. రాజకీయ కక్షలతో చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న పిటిషనర్ వాదనను తిరస్కరించింది. చట్టప్రకారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు నేడు ఆయనను అరెస్ట్ చేశారు. మన్నే గుడలో భూ కబ్జాకు యత్నించిన కన్నారావుతో పాటు మరో 38 మందిపై 147, 148, 447, 427, 307, 436, 506,r/w149 IPC వంటి పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు..
ఇదిలా ఉండగా హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ కావడంతో కన్నారావు.. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి సింగపూర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక గతంలో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఆయనను విచారిస్తున్న పోలీసులు.. మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి ముందు హాజరపరచనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నెంబర్ 32/ఆర్యూయూ లో ఉన్న రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. ఏమేరకు ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.