రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఆ పార్టీ కీలక నేతలంతా కారు దిగడం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీగా మారే దశకు చేరుకొందనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) బీఆర్ఎస్ (BRS)ను వీడి కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారు అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..
అసలే లోక్ సభ ఎన్నికలలో (Lok Sabha Election) అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున కొనసాగుతున్న వలసలు టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నేతల నుంచి ముఖ్యమైన క్యాడర్ వరకు ఎవరి దారి వారు చూసుకోవడంతో.. గులాబీ బాస్ మాటకు విలువ జారిపోయిందని అనుకొంటున్నారు.. కేటీఆర్ (KTR) సైతం బుజ్జగించిన నేతలు వినే పరిస్థితి లేనట్లుగా చర్చించుకొంటున్నారు..
మరోవైపు విజయలక్ష్మి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.. కాంగ్రెస్ (Congress)లోకి ఆహ్వానించారని, చేరికపై కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ ప్రకటనతో చర్చలు సఫలం అయ్యాయని ఫిక్స్ అయ్యారు.. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మితో పాటుగా మరో 10 మంది కార్పోరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మేయర్‌తో పాటే వీరి చేరికకు కూడా కాంగ్రెస్ కసరత్తులు పూర్తి చేసిందని తెలుస్తొంది. వీరంతా రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్ సహా గ్రేటర్ పరిధిలోని కొందరు నేతలు పార్టీని వీడగా.. వీరి చేరికతో హైదరాబాద్ పరిధిలో పార్టీకి పట్టు లేకుండా పోతుందేమోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నట్లు చర్చలు మొదలైయ్యాయి..