తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి(Telangana CM) గా రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయడానికి ఇంకా కొన్ని నిమిషాలు మిగిలుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో పాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. సోనియాగాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీహెచ్ యోగక్షేమాలను సోనియా, రాహుల్ గాంధీలు అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో సోనియా, రాహుల్, ప్రియాంకలకు రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జ్ ఠాక్రే, శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. రేవంత్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఎల్బీ స్టేడియంలో భారీ భద్రత నడుమ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 3వేల మంది పోలీసు బలగాలు మొహరించాయి.
ఎల్బీ స్టేడియం లోపల, బయట మెటల్ డిటెక్టర్లు, పోలీసు జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇన్‌చార్జి డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టేడియం చుట్టూ ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద మెటల్ డిటెక్టర్లను నియమించారు.