Telugu News » IT Raids : పాతబస్తీలో ఐటీ రెయిడ్స్.. వ్యాపారవేత్తలే టార్గెట్..!!

IT Raids : పాతబస్తీలో ఐటీ రెయిడ్స్.. వ్యాపారవేత్తలే టార్గెట్..!!

కోహినూర్‌, కింగ్స్‌ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చుతున్నట్లు సమాచారం అందడంతోనే ఐటీ అధికారులు రెయిడ్స్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

by Venu
Logo_of_Income_Tax_Department_India

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ రాష్ట్రంలో ఐటీ అధికారులు వరుసగా దాడుల (IT Raids)తో బిజీగా ఉంటున్నారు.. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో సోదాలు చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ తాజాగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కింగ్స్‌ ప్యాలెస్‌ (Kings Palace) యజమానులతోపాటు, కోహినూర్‌ గ్రూప్స్‌ (Kohinoor Group) ఎండీ మజీద్‌ ఖాన్‌ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షానవాజ్‌ ఇంటితోపాటు పలువురి ఇండ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

కోహినూర్‌, కింగ్స్‌ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చుతున్నట్లు సమాచారం అందడంతోనే ఐటీ అధికారులు రెయిడ్స్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా వరుసగా హైదరాబాద్‌‌లో జరుగుతున్న ఐటీ రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, వ్యాపారులే లక్ష్యంగా ఐటీ అధికారులు రెయిడ్స్ నిర్వహిస్తున్నారు..

మరోవైపు పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతల ఇళ్ళల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్‌పై ఐటీ సోదాలు జరుపుతున్నారు.

హోటల్ యజమాని శేఖర్ గౌడ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. యజమాని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు అందుతున్నాయనే ఆరోపణలతో ఈ రెయిడ్స్ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం. మరోవైపు ఈ ఏడాది మే నెలలో కూడా కోహినూర్‌ గ్రూప్‌ ఎండీ ఇండ్లు, కార్యాలయాలతోపాటు గ్రూప్‌లోని పలు హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓల్డ్‌సిటీ, దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్‌ గ్రూప్‌కు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

You may also like

Leave a Comment