హైదరాబాద్ లో దొంగలు రోజురోజుకి పేట్రెగిపోతున్నారు. ఇప్పటి వరకు ఇళ్లకి, కార్యాలయాలకి, దేవుడి గుళ్లకు మాత్రమే కన్నమేశారు. కానీ ఇప్పటి దొంగలు రూట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. దీంతో కొందరు గణేశ్ మండపాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు.
మియాపూర్‌లో గణేష్ మండపంలో చోరీ జరిగింది. బంగారమో , లేక ఇతర వస్తువులు దొంగిలిస్తే ఫర్వాలేదు కానీ గణేష్ చేతిలో ఉన్న లడ్డూని దొంగిలించాడు ఓ ప్రబుద్దుడు. గత రాత్రి గణేష్ నిర్వాహకులు నిద్రిస్తున్న సమయంలో 11 కిలోల లడ్డూను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడ జాతీయ రహదారిపై ‘ఓంకార్ సేవా సమితి’ అనే స్థానిక యువజన బృందం గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. బుధవారం తెల్లవారుజామున 4:20 గంటల ప్రాంతంలో 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న ఓ వ్యక్తి గణేష్ మండపంలోకి ప్రవేశించి లడ్డూతో పరారయ్యాడు.
ఈ తతంగం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై నిర్వాహకులు వెంటనే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసి నమోదు చేశారు.