రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)లో భాగంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీ(TS RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా రవాణా సంస్థలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి. ఈ పథకం ప్రవేశ పెట్టిన రెండో రోజే ప్రబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మార్పులు సంతరించుకున్నాయి.
ఉచిత ప్రయాణం కావడంతో బస్టాండ్‌ల్లో మహిళల రద్దీ పెరిగింది. దీంతో ఈ ప్రభావం హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)పై పడింది. ఈ క్రమంలోనే పథకం ప్రవేశ పెట్టిన రెండో రోజే నగరంలోని ప్రధాన మెట్రో కంపార్ట్‌మెంట్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఉచితంగా ప్రయాణం వల్లనే మహిళలు మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు గిరాకీ తగ్గిందని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం మెట్రోలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. సాధారణంగా సెలవు రోజుల్లో మెట్రోలో ఎక్కువగా రద్దీ కనిపించేది. కానీ మహాలక్ష్మి పథకం ప్రారంభం కావడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య అమాంతం తగ్గిందనే చెప్పాలి.
మహాలక్ష్మి పథకాన్ని శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించగా సాయంత్రం వరకు మెట్రోలో దాదాపు 20వేల మంది వరకు రద్దీ తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ పథకం ప్రవేశ పెట్టినప్పుడే మెట్రో అధికారులు కూడా ఆందోళన చెందారు. అయితే వారం రోజులు గడిస్తేగానీ ఈ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది చెప్పలేమని మెట్రో అధికారులు చెబుతున్నారు.