గజ్వేల్ (Gajwel) నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు నేడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)ని బంజారహిల్స్ (Banjara Hills)లోని ఆయన నివాసంలో కలిశారు. వీరంతా ఆర్ఆర్ఆర్ (RRR)లో భూములు కోల్పోతున్న వారు కావడం విశేషం.. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన మంత్రి.. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని హామీ ఇచ్చారు.

అలాగే ఇప్పటికే తాము మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిగిలిన ఆ కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్లో కోల్పోతే తమ జీవనాధారం కష్టం అవుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన రైతులు.. తమ పరిస్థితిని మానవతా ధృక్పథంతో పరిశీలించి ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు..
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృధా అవడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని మంత్రి వివరించారు.. వారి తప్పిదాల వలన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలా తాము తొందరపడమని ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.