హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ బరిలో ఉన్న నేతల మధ్య పోటీ తీవ్రంగా నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ తగ్గని వారు.. ఊహకందని విధంగా విమర్శించుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది.. పాతబస్తీలో పాతుకుపోయిన ఎంఐఎంని ఢీ కొట్టడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, సమస్యలు రాజ్యమేలుతున్నాయనే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఎన్నికలలో ఇవన్నీ సాధారణమైనప్పటికీ అభివృద్ధి విషయమై ఏ పార్టీ అభ్యర్థి కూడా ప్రస్తుతం మాట్లాడడం లేదంటున్నారు.. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ సుమారు 40 సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాదిపత్యంగా రాజ్యమేలుతోంది. అటువంటి పార్టీని ఓడించాలంటే ప్రత్యర్థి బలమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి.. తాము గెలిస్తే ఏం చేస్తాం.. అభివృద్ధికి తీసుకోబోయే ప్రణాళికలు ఏమిటనేది ప్రజలలోకి తీసుకువెళ్లాలి..
కానీ ప్రస్తుతం అభివృద్ధి విషయాన్ని దూరం పెట్టి ఆరోపణలు చేసుకోవడం కనిపిస్తోంది. ఎంఐఎంకు మీది బీటీం అని ఓ పార్టీ నేత అంటే.. కాదు మీదే బీటీం అంటూ మరో నేత ఇలా ప్రత్యారోపణలు చేసుకోవడం వల్ల.. ప్రజల కంటే ముందు లీడర్లు మారాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.. ఇదిలా ఉండగా.. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ (BRS) పార్టీ టికెట్ కోసం గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం అధినేత ను వేడుకొన్న సంగతి తెలిసిందే..
తాజాగా ఇవన్నీ మరచిపోయి పార్లమెంట్ ఎన్నికలలో ఎంఐఎంపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది.. అలాగే ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అసదుద్ధీన్‌ను బంగాళా ఖాతంలో విసిరేయాలని విమర్శించారు. మరోవైపు బీజేపీ (BJP) అభ్యర్థి మాధవీలతను సైతం ఆయన వదలలేదు. కోవిడ్ సమయంలో విరించి హాస్పిటల్లో రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసి ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆరోపణలు గుప్పించారు..
ఇక మాధవీలత సైతం ఏం తక్కువ కాదు అన్నట్లుగా ఎంఐఎం, బీఆర్ఎస్లపై ఘాటైన విమర్శలు చేయడం కనిపిస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ (Congress) అభ్యర్థిని పరిగణలోకి తీసుకోకపోవడం, ఆ పార్టీ ప్రస్థావనే విమర్శలలో కనబడకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. మూడు పార్టీల మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్నట్లుగా భావిస్తున్నారు.. అయితే గెలిచాక చేసే పనుల గురించి వెల్లడించకుండా.. వ్యక్తిగతంగా దూషణలకు దిగడం జనానికి విసుగు తెప్పిస్తుందని అంటున్నారు..