సుమారుగా ఓ ఇరవై ఏళ్లు అధికారం మనదే.. మనల్ని కాదని వేరే పార్టీ తెలంగాణ (Telangana)లో బతికి బట్టకడుతుందా?.. ఇది ఒకప్పుడు బీఆర్ఎస్ (BRS) అధినేత ధీమా.. కానీ ఎక్కడో రేవంత్ కు సీఎం సీటు ఎక్కే అదృష్టం ఉందికావచ్చు. అందుకే అనూహ్యంగా కాంగ్రెస్ (Congress) పుంజుకోవడం.. అధికారంలోకి రావడం.. సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయడం.. ఊహించనట్లుగా జరిగిపోయాయి..
బీఆర్ఎస్ బాస్ ఏదైతే జరగకూడదని భావించి అధికారం కోసం పన్నిన ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయి.. అందులో ముఖ్యంగా తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా సాగుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలు బయటికి వస్తుండగా.. దర్యాప్తు సైతం రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. అలా ఒక్కొక్కరుగా తామూ ఫోన్ ట్యాపింగ్ బాధితులమే అంటూ తెరమీదకు వస్తున్నారు.
ఇప్పటికే తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించగా, తాజాగా మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మొదటి వాడిని తానేనని చెప్పారు. వీరే కాకుండా ఇప్పటికే ఇంకా కొంతమంది తమ ఫోన్ కూడా ఇదే గతి పట్టిందనే ఆరోపణలతో ముందుకు వస్తున్నారు. మరోవైపు పోలీసులు దూకుడు పెంచడంతో రోజు రోజుకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది.
తాజాగా మరో ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. ఇలా అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారంతో కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ట్యాపింగ్ నెట్ వర్క్ ఒక వ్యవస్థలా మారి టాగూర్ సినిమాని తలపించేలా సాగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.. కాగా అధికారులకు వచ్చిన సమాచారంతో నేడు జూబ్లీ హిల్స్ లోని ఓ గెస్టు హౌస్ లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
సోదాలు జరిపిన గెస్ట్ హౌస్ రేవంత్ నివాసానికి సమీపంలో ఉందని.. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్ లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. అదేవిధంగా విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీదనే టాక్ వినిపిస్తుంది. దీన్ని బట్టి త్వరలోనే ఈ కేసు అతని మెడకు సైతం చుట్టుకొనే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది.