ఆకలి వేస్తుందని అడ్డమైన గడ్డి తింటే అజీర్తి వేసి అనారోగ్యం రావడం ఖాయం.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి కూడా ఇలాగే తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కుప్పల్లో ఉండగా.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ (RTC) భవిష్యత్తు ఈ పథకం వల్ల మరింత దిగజారే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ జోన్ (Greater Hyderabad Zone)లో రోజూ 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో దాదాపు 18 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం ప్రయాణికుల్లో మహిళలు 7.2లక్షల వరకు ఉంటారని అంచనా.. వాస్తవంగా గ్రేటర్లో ప్రయాణికులకు రోజువారీగా సేవలందించాలంటే ఆర్టీసీ ప్రతిరోజు 7 వేల బస్సులు నడపాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నవి 2800 బస్సులు మాత్రమే..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తే ఎంత ఖర్చు అవుతుందనే విషయంపై ఆర్టీసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెచ్చి.. ఆ తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తే కొంత మేర ఆర్టీసీకి నష్టం తగ్గుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కర్ణాటక తరహాలో శక్తి స్మార్ట్ కార్డ్ (Smart Card)లను తెలంగాణలో ప్రవేశపెడతారా లేదా అనేది తెలియవలసి ఉంది. లేదంటే మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తారా అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. ఇక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం పేరుతో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా మహిళలు స్మార్ట్ కార్డ్ తీసుకునేలా సింధు పోర్టల్ అందుబాటులోకి తెచ్చి ప్రత్యేక కార్డులు జారీ చేస్తోంది.. మొత్తానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీ వల్ల రాష్ట్ర ఆర్టీసీ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది..