తెలంగాణ (Telangana)లో ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కూడా కాలేదు అప్పుడే.. హైదరాబాద్ (Hyderabad) ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధ్యక్షా ఈ పరిణామాలకు అర్థ ఏంటనే ప్రశ్నలు కూడా మొదలైయ్యాయి. కాగా ఉస్మానియా యూనివర్శిటీలో నెలకొన్న సమస్యల పై ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో కూడా విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే..
కాగా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పాటు కాకముందే మరోసారి యూనివర్శిటీలో ఆందోళనలు మొదలైయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఓయూ వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ పాలన వీడాలని.. రాత్రి 11 గంటల తర్వాత ఓయూలో గేట్స్ మూసివేయాలని, బారిగేడ్లు, కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వీసీ రవీందర్ కి, విద్యార్థులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది.
మరోవైపు యూనివర్శిటీ విద్యార్థులు.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని, పేద విద్యార్థులకు విద్య భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఓయూ అధికారులపై ఉందని వెల్లడించారు. ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University)లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో వీసీ విఫలమయ్యారని ఆరోపించారు. పరిపాలన భవనంలో ఉన్న బారిగేడ్లు, కంచెలు తొలగించాలని తెలుపుతూ.. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓయూలో నిర్బంధాలు ఎక్కువగా ఉండేవని వెల్లడించిన విద్యార్థులు.. వాటన్నింటినీ తొలగించి విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిర్బంధాలన్ని తొలగిపోయి, ఓయూ వీసిని కలవాలంటే ఎలాంటి షరతులు ఉండకూడదని డిమాండ్ చేశారు.. కాగా ఈ ఆందోళనలో పరిశోధక విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.