ప్రస్తుత సమాజంలో మోసం చేయడం చాలా సులువుగా మారిపోయిందని కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఎన్నిరకాలుగా సైబర్ మోసాలపై అవగాహన కలిగిస్తున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అదీగాక మోసం చేసే వారు కూడా కొత్త కొత్త మార్గాలను వెతుక్కొంటూ ఉన్నారు. మోసం చేయడం ఇంత సులువా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు..
ఇక తాజాగా ఓ ఘరానా మోసగాడు మ్యాట్రిమోనీ (Matrimony)లో అడ్డవేసి.. సులువుగా ఓ మహిళకు టోకరా వేసిన ఉందంతం వెలుగులోకి వచ్చింది. అతను చెప్పిన మాయ మాటలు నమ్మిన ఆ మహిళ ఏకంగా కోట్లల్లో డబ్బులు కోల్పోయింది. హైదరాబాదు (Hyderabad)లో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఉండే ఓ మహిళను మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ ఘరానా మోసగాడు రూ.2.71 కోట్ల మేర ముంచినట్లు తెలుస్తోంది.
ఆ కేటుగాడి పేరు పేరు శ్రీ బాలవంశీకృష్ణ అని సమాచారం.. ఇతను మ్యాట్రిమోనీలో మహిళతో పరిచయం పెంచుకొని అమెరికా (America) తీసుకెళతానని మోసం చేసినట్లు తెలుస్తోంది. అంటే కాకుండా యూఎస్ పార్టనర్ వీసా కోసం సిబిల్ స్కోరు 850 ఉండాలని కూడా నమ్మబలినట్లు సమాచారం.. ఇందు కోసం తమ కంపెనీ నుంచి లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఆ మహిళను ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆ మహిళ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగేసిన ఆ కేటుగాడు.. అనంతరం మాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె అతన్ని సంప్రదించాలని ఎంతలా ప్రయత్నించిన.. ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన ఆ మహిళ లబోదిబోమంది. సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు..