పార్లమెంట్ ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS)పై ఆశలు సన్నగిల్లగా.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య వార్ ఉత్కంఠంగా సాగే అవకాశాలున్నట్లు చర్చించుకొంటున్నారు.. ఈ క్రమంలో కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 8 లేదా 9వ తేదీన నరేంద్ర మోడీ (Narendra Modi)మూడవ సారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ పరిధిలోని మెయినాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ హయాంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. దేశంలో దిగుమతులు తగ్గి.. ఎగుమతులు పెరిగాయని తెలిపారు. పదేళ్లుగా నీతివంతమైన పాలన చేస్తున్న ఆయనతో.. ఆవినీతిపరులకు పొత్తు ఏంటని ప్రశ్నించారు.
అదేవిధంగా మోడీ రాకముందు దేశంలో మాఫియా రాజ్యమేలిందని.. కానీ ఇప్పుడ ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. గతలో ప్రధాని కీలు బొమ్మగా మాత్రమే వ్యవహరించారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ హయాంలో చైనా వస్తువులు ఇంపోర్ట్ చేసుకునేవాళ్లం.. కానీ ఈరోజు చిన్న పిల్లలా బొమ్మల నుంచి చంద్రమండలం వెళ్ళే మెషీన్స్ వరకు ఇండియాలో తయారు చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు.
మన్మోహన్ సింగ్ హయాంలో ప్రతి 15 రోజుల కి ఓ కుంభకోణం జరిగిందని ఆరోపించిన కేంద్ర మంత్రి.. మోడీ ప్రధానిగా ఉన్న ఈ పదేళ్ళలో ఒక్క రూపాయి అవినీతి లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తే.. 2028 లో బీజేపీని రాష్ట్రంలో అధికారం లోకి తెచ్చే బాధ్యత నాదని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మరోవైపు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. గెలుపు లో కాంగ్రెస్ కంటే నాలుగు రెట్లు బీజేపీ ముందున్నదన్నారు. మోడీ కి ఓటేయాలని మనం గర్వంగా అడుగ గల్గుతున్నాం.. కానీ రాహుల్ పేరుతో కాంగ్రెస్ ఓటు అడిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రంజిత్ రెడ్డి బీజేపీలో చేరుతా అని మూడు నెలలు ఆఫీస్ చుట్టూ తిరిగాడని.. ఇక్కడ ఛాన్స్ లేకపోవడంతో.. కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.