Telugu News » Telangana : ఐ అండ్ పీఆర్ లో కలెక్షన్ కింగ్..!

Telangana : ఐ అండ్ పీఆర్ లో కలెక్షన్ కింగ్..!

నెంబర్ వన్ పేపర్ కి కోటి రూపాయల యాడ్ అని ఆర్వో రిలీజ్ అయితే.. ఏజెన్సీకి కోటి వచ్చినా.. యాజమాన్యానికి మాత్రం 40 లక్షలే చేరేది. ఇలా చాలా రాష్ట్రాల పేపర్స్ కి, టీవీలకు రిలీజ్ అయిన సొమ్ములో 60 శాతం డబ్బులను ఏజెన్సీలు, రాజమౌళి నొక్కేశారు.

by admin
I & PR Scam in BRS Government

– సమాచార పౌర సంబంధాల శాఖలో లెక్కలేనన్ని స్కాములు
– ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు
– ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్ ప్రచారం
– రిలీజ్ అయిన సొమ్ములో 60 శాతం డబ్బు పక్కదారి
– ఆ సొమ్మంతా ఏజెన్సీలు, రాజమౌళి చేతుల్లోకే..
– అక్కడి నుంచి ఎటువైపో..
– విచారణ జరిపిస్తే నిజాలన్నీ బయటకు
– అవినీతి సొమ్ము కక్కిస్తానన్న కాంగ్రెస్ ఆ దిశగా అడుగులేస్తుందా?
– రాజమౌళి సహా అధికారులను పదవి నుంచి తప్పిస్తే సరిపోతుందా?
– landsandrecords.com పరిశోధనాత్మక కథనం

బీఆర్ఎస్ (BRS) పాలనలో స్కాములకు లెక్కేలేదు. ఎందులో చూసినా కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన బాగోతాలు ఎన్నో వెలుగుచూశాయి. తమకు అనుకూలమైన వారిని అధికారులుగా పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ ప్రభుత్వం వచ్చాక లెక్కలన్నీ తేలుస్తామని కాంగ్రెస్ (Congress) ముందునుంచి చెబుతూ వచ్చింది. పదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు హస్తం ప్రభుత్వం ఏర్పడింది. దీంతో గత ప్రభుత్వ తప్పిదాలు, అక్రమాలపై విచారణకు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఐ అండ్ పీఆర్ (I & PR) లో జరిగిన అవినీతి బాగోతాన్ని వివరిస్తూ landsandrecords.com పరిశోధనాత్మక కథనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే.. డైరెక్టర్ గా వ్యవహరించిన రాజమౌళి చుట్టూనే అంతా తిరుగుతోంది.

I & PR Scam in BRS Government

రెండు పర్యాయాల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రకటనలు గుమ్మరించింది. ముఖ్యంగా జాతీయ రాజకీయాల ప్రకటన నేపథ్యంలో తెలంగాణ మోడల్ అంటూ దేశం మొత్తం ప్రకటనలు ఇచ్చారు. అయితే.. పథకాలు ప్రజలకు చేరాలనే పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో ఐ అండ్ పీఆర్ లో అవినీతి రాజ్యమేలింది. ఔట్ డోర్ మీడియాతో కలుపుకుని గడిచిన 5 ఏళ్లలో మొత్తం వెయ్యి కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సొమ్మును ఇబ్బడిముబ్బడిగా ప్రచారానికి ఖర్చు చేసి అడ్డగోలుగా దొచుకున్నారని.. ఇందులో కీలకంగా రిటైర్డ్ ఆఫీసర్, అప్పటి డైరెక్టర్ బీ రాజమౌళి కీలకంగా వ్యవహరించారని ఆ శాఖలో తెగ మాట్లాడుకుంటున్నారు.

ఏదైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఐ అండ్ పీఆర్ కి చెబుతుంది. అక్కడ ఎంప్యానల్ చేసుకున్న 20 ఏజెన్సీలు ఉంటాయి. కానీ, చక్రం తిప్పేది అంతా వలయం, తేజ లాంటి ఏజెన్సీలే. ప్రధానమైన ఐదు పత్రికలకు, ఛానల్స్ కి ఎలాగూ రిలీజ్ ఆర్డర్ ప్రకారం ఇస్తుంటారు. మిగితా ఏజెన్సీలకి కూడా పెద్ద ఏజెన్సీ వారే మాట్లాడి ఇచ్చేస్తుంటారు. ఇందులో ఏజెన్సీ నుంచి 15 శాతం కమిషన్ కామన్ గా ఉంటుంది. ఫుల్ జాకెట్ ప్రకటనల్లో భారీ బడ్జెట్ ఉంటే పెద్ద ఏజెన్సీ వలయం జగన్మోహన్ తో కూడిన మాయలు ఉంటాయి. చిన్న పత్రికలు, చిన్న ఛానల్స్ పబ్లిషర్స్ ని నేరుగా పిలుపించుకుంటారు రాజమౌళి. అసలు మీ మీడియాకు ఈ యాడ్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ, నేనే పెట్టించాను.. కొంత వరకే ఇస్తానని బేరాసారాలు అడుతారు. సరే ఎంతో కొంత వస్తుంది కదా అని మార్కెంటింగ్ పర్సన్స్ ఒప్పేసుకుంటారు. తర్వాత ఏజెన్సీ ఎంత ఇస్తుందో అంత తీసుకోవాల్సిందేనని ఒక్కరోజు ముందు చెప్తారు. దీంతో డైలామాలో పడే మార్కెంటింగ్ టీమ్ మీరు ఎంతైనా పెట్టుకోండి ఒప్పందం ప్రకారం ఇస్తే చాలు అని చెబుతుంటారు. యాజమాన్యాలకు అన్నీ తెలిసినా ఏం చేయలేని పరిస్థితి.

కేసీఆర్ జాతీయ రాజకీయాల సమయంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, బెంగాల్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల లోకల్ పత్రికలకు యాడ్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ దేశం మొత్తం వెలిగేలా.. ప్రజల సొమ్ముతో ప్రకటనలు గుప్పించారు. కొన్ని పత్రికలకు ఒక్కో యాడ్ కు 4 నుంచి మూడున్నర కోట్ల వరకు ముట్టజెప్పారు. ఔట్ డోర్ మీడియాకు పార్టీ యాడ్స్ లా ప్రభుత్వ ప్రకటనలను వాడారు. నెంబర్ వన్ పేపర్ కి కోటి రూపాయల యాడ్ అని ఆర్వో రిలీజ్ అయితే.. ఏజెన్సీకి కోటి వచ్చినా.. యాజమాన్యానికి మాత్రం 40 లక్షలే చేరేది. ఇలా చాలా రాష్ట్రాల పేపర్స్ కి, టీవీలకు రిలీజ్ అయిన సొమ్ములో 60 శాతం డబ్బులను ఏజెన్సీలు, రాజమౌళి నొక్కేశారు. అడగకుండానే కొన్ని పత్రికలకు యాడ్స్ ఎక్కువ రేట్లతో కుమ్మరించారు.

తొమ్మిదేళ్లలో చిన్న పత్రికలకు సరైన యాడ్సే ఇవ్వలేదు. ఎవరైనా ఫైట్ చేస్తే సగానికి సగం తగ్గించి ఇచ్చారు. వారి బాధలు వర్ణణాతీతం. సొంత రాష్ట్రంలో యాడ్స్ ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వాళ్లకు, అనుకూలమైన వారికి మాత్రమే కమిషన్స్ తీసుకొని ఇచ్చేవారని చిన్న పత్రికల వారు వాపోతున్నారు. బీఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పింది కాంగ్రెస్. ప్రస్తుతం రాజమౌళి సహా ఇతర అధికారులకు స్థానచలనం తప్పించడం చేస్తోంది. ఇలా చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదనే విమర్శలు వస్తున్నాయి. ఐ అండ్ పీఆర్ లో స్కాముల గురించి విచారణకు ఆదేశిస్తే.. కుప్పలు, తెప్పలుగా ఫిర్యాదులు అందుతాయని అంటున్నారు. అసలు, ఎన్ని డబ్బులు విడుదల అయ్యాయి? ఎంత ఏజెన్సీలకి వెళ్లాయి? పబ్లిషర్స్ తీసుకున్నది ఎంత? ప్రచారం చేసింది ఎన్ని స్లాట్స్? ఔట్ డోర్ మీడియాలో ఎన్ని రోజులు వేయాల్సిన ప్రచారం ఎన్ని రోజులు బోర్డులపై ఉన్నాయి? ఎన్నింటికి ఆర్వోలు తీసుకుని ఎన్నింటికి వేశారు? చిన్న ఛానల్స్ రేట్లు తగ్గించి ఎక్కువ స్లాట్స్ తో ఎంత నొక్కేశారు? అనేది విచారణ జరిపితే అన్నీ బయటకొస్తాయని శాఖలోని అధికారులు చెబుతున్నట్టుగా landsandrecords.com తెలిపింది.

You may also like

Leave a Comment