టీఆర్టీసీ బిల్లు ఈ నెల 2 న మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్ కు వచ్చిందని ఆ బిల్లుపై లీగల్ ఒపీనియన్ తీసుకోవలసి ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. దీన్ని పరిశీలించేందుకు న్యాయ సలహాలు తీసుకోవలసి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే దీనికి సంబంధించిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
దీనికి సంబంధించిన బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన బిల్లును రూపొందించి తమిళిసై ఆమోదానికి పంపింది. ఈ బిల్లుకు ఆమె ఆమోదం తెలిపితే ఇతర బిల్లులతో బాటు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సర్కార్ యోచించింది.
సాంకేతిక పరంగా ఇది ఆర్ధిక బిల్లు కావడం వల్ల గవర్నర్ ఆమోదం తప్పనిసరి అంటున్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ, వారిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులుగా గుర్తింపుపై రూపొందించాల్సిన విధి విధానాల కోసం ఉప సంఘాన్ని నియమించాలన్న యోచన ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈ సబ్ కమిటీ అధ్యక్షునిగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉంటారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల 373 మంది సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయంపట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.