ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారి ఆమ్రపాలి (Amrapali) తిరిగి తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తోన్నట్టు సమాచారం.. 2010 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కలెక్టర్ గా పని చేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకొన్న ఆమ్రపాలి.. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడ డిప్యూటీ సెక్రటరీ గా చేరారు.
తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, ఆమ్రపాలి తిరిగి రాష్ట్రానికి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు చేసుకొన్నట్టు తెలుస్తోంది. కాగా గతంలో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శేషాద్రి సూచనల మేరకు ఆమ్రపాలి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. అయితే మరికొద్ది రోజుల్లో ఆమ్రపాలి నియామకంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం..
మరోవేపు సెంట్రల్ డిప్యూటేషన్ కాలం పూర్తి కావడంతో తెలంగాణకు వచ్చిన శేషాద్రి కొంతకాలం జీఏడీలో పనిచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దగ్గర సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సైతం సీఎంఓలోకి రావచ్చని సచివాలయ వర్గాల సమాచారం. ఈ వార్తలను నిజం చేస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఆమ్రపాలి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి.. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకి అలాట్ అయ్యారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేసిన ఆమ్రపాలి.. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్ళి కేంద్ర క్యాబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు. ఆ తర్వాత పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.