రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) విజయంపై సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఓట్లు కలవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. మిగతా మూడు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హిట్ పెంచుతోన్నాయి.
మరోవైపు రాజస్థాన్ (Rajasthan) ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో అవలంభించిన ఒంటెద్దు పోకడల వల్లే కాంగ్రెస్ ఓడి పోయిందన్న నారాయణ.. ఈ ఓటమి గుణపాఠంగా తీసుకోవాలని తెలిపారు. అదీగాక తెలంగాణ (Telangana)లో ఎంపీ సీటుకు పోటీ చేస్తామని నారాయణ వెల్లడించడం సంచలనంగా మారింది. కాగా కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లో సైతం పోటీ చేస్తోన్నట్టు ఆయన తెలిపారు.
మరోవైపు నారాయణ ప్రకటనకు కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తోందనేది కీలకంగా మారింది. అసలు తెలంగాణలో సీపీఐ కి, కాంగ్రెస్ ఎంపీ సీటు ఇస్తుందా..? అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మరి ఎంపీ సీటుపై కాంగ్రెస్ స్పందిస్తుందా? లేదా? అనేది తెలియాల్సిఉంది.
మరోవైపు భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం పెట్టాలని, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో చితికి పోయిన ప్రజలు, నిరుద్యోగులు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై కొండంత ఆశతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కేసీఆర్ పుణ్యమా అని ఇప్పటి వరకి రేషన్ కార్డులు దక్కని వారు ఆశతో ఎదురు చూస్తోన్నట్టు తెలిపిన వెంకటరెడ్డి.. బీఆర్ఎస్ నేతల్లో ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తలదన్నేలా ప్రజల పట్ల శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు చాడ వెంకటరెడ్డి..