తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కు మూడేళ్ళ జైలు శిక్ష పడింది. ఈ కేసులో ఆయనను కోర్టు దోషిగా ప్రకటించడంతో పోలీసులు అరెస్టు చేశారు. అయిదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనకుండా కూడా ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు నిషేధించింది. తాను అధికారంలో ఉన్నప్పుడు విదేశాల నుంచి అందుకున్న విలువైన బహుమతులను విక్రయించి లాభాలు ఆర్జించారని ఇదివరకే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే శనివారం కోర్టులో విచారణ జరుగుతుండగా ఆయన కోర్టులో లేరు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) పార్టీ చైర్మన్ కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ ను లాహోర్ (Lahore) లోని ఆయన నివాసం నుంచి ఇస్లామాబాద్ పోలీసులు అరెస్టు చేసి ఈ నగరానికి తీసుకువచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ను కోట్ లఖ్ పథ్ జైలుకు తరలిస్తున్నారని పంజాబ్ పార్టీ శాఖ ట్వీట్ చేసింది.
ట్రయల్ కోర్టు విచారణను కొట్టివేయవలసిందిగా ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్ ను పాక్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్న ఇమ్రాన్.. తన లీగల్ టీమ్ వెంటనే అప్పీలు దాఖలు చేయనుందని తెలిపారు. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తాము పిటిషన్ వేయనున్నట్టు ఇమ్రాన్ లాయర్ ఇంతెజార్ పంజోతా చెప్పారు. ఇస్లామాబాద్ లోని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి హుమాయూన్ దిలావర్ .. ఇమ్రాన్ ఖాన్ కు లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ ఫైన్ చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైల్లో ఉంచాలని కూడా ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఎలెక్షన్ కమిషన్ కు ఇమ్రాన్ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారని, ఈ కేసులో ఆయనపై వచ్చిన అభియోగాలు నిరూపితమయ్యాయని జడ్జి అన్నారు. అవినీతి పనులకు పాల్పడినందుకు ఇమ్రాన్ దోషి అని స్పష్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్ ఇంటివద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.
అయినప్పటికీ ఇమ్రాన్ పార్టీకి చెందిన కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కోర్టు తీర్పు ను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. తాను ప్రధాని పదవిలో ఉండగా గల్ఫ్ ..తదితర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రభుత్వాలు తనకు ఇచ్చిన ఖరీదైన బహుమతులను స్వదేశానికి తెచ్చారని, వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచకుండా ఎక్కువ ఖరీదుకు అమ్ముకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీన్నే తోషాఖానా కేసుగా పేర్కొంటున్నారు.