వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా(AUS)తో తలపడిన భారత్(IND) పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా గురువారం మరోసారి తలపడనుంది. ఇందుకు వైజాగ్ వేదిక కానుంది. నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(T-20 Series) నిర్వహించనున్నారు. వైఎస్సార్ ఏసీడీ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
వైజాగ్‌లో నిర్వహించనున్న భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌కు కట్టుదట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులు ఉండనున్నారు. స్టేడియం వద్ద మూడు అంచెల భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ప్రేక్షకులను సాయంత్రం 5 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు.
స్టేడియంలో మంగళవారం ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చే వారిని సకాలంలో స్టేడియంలోకి వెళ్లేలా పోలీసులు సహకరించాలని ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి సూచించారు. ఫుడ్ స్టాళ్లలో నిర్దేశించిన ధరలకే విక్రయించే విధంగా చూస్తామని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు.
ఈ మ్యాచ్‌లో 15మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన భారత జట్టు నుంచి సూర్యకుమార్, ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా సభ్యులందరికీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.
రెండో మ్యాచ్ నవంబర్ 26న తిరువనంతపురంలో, మూడో మ్యాచ్ 28న గువాహటిలో, నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో, డిసెంబర్ 3న బెంగుళూరులో చివరి ఐదో మ్యాచ్ జరుగనుంది. ఇందులో తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్న శ్రేయస్ అయ్యర్ చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి వైస్ కెప్టెన్ హోదాలో రానున్నాడు.
టీ-20 భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్.