తెలంగాణ (Telangana) వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వీధివీధిన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రగతి భవన్ (Pragathi Bhavan) లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ (CM KCR) పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. సీఎంఓ (CMO) అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వెళ్లారు. అక్కడ అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు సీఎం. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు కేసీఆర్ కు పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సందర్శకుల రిజిస్టర్ లో సీఎం సంతకం చేశారు. తర్వాత అక్కడి నుంచి కేసీఆర్ గోల్కొండ కోటకు వెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోరాటం చేసి ఈ స్వాతంత్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. అలాగే, జూన్ 2న తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహకాలు అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు స్పీకర్ పోచారం.
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని.. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ ప్రభుత్వం బందీగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలోని మెజారిటీ మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయని ఆరోపించారు. దేశంలో అత్యధిక అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు కిషన్ రెడ్డి. ఇటు, హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో నాయకులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.