దేశమంతా అంబరాన్నంటేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మనసా వాచా కర్మణా దేశ రక్షణకే అంటూ నినదించారు భారత ప్రజలు. ఈ క్రమంలోనే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (Sri Venkateswara Vedic University)లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివ మూర్తి (Rani Sadasiva Murthy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం చేసి.. వర్సిటీ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరీ మట్టి-మేరీ దేశ్ (నా నేల-నా దేశం) బ్యానర్ ను ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వేద విశ్వవిద్యాలయ విద్యార్థులు పథసంచలనం చేశారు. వర్సిటీ వీధుల్లో కవాతు నిర్వహించారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. స్థానిక పోలీసులు కూడా ఈ పథసంచలనంలో పాల్గొన్నారు.
వేద జ్ఞానాన్ని అన్ని కోణాలలో ప్రోత్సహించడానికి వేద విశ్వవిద్యాలయం ఎంతో అనుకూలంగా ఉంటుందని 2006లో దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రామేశ్వర్ ఠాకూర్ వర్సిటీ స్థాపనకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వవిద్యాలయానికి పూర్తి నిధులను సమకూర్చింది. అలా.. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.