ఇండియా టుడే (India Today) ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట విడుదల చేసిన ఒపినీయన్ పోల్స్ (Opinion Poll)లో సంచలన విషయాలను వెల్లడించింది. తెలంగాణలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతుందని తెలపింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ తన సత్తా చాటుతుందని సర్వే వివరించింది.
రాష్ట్రంలో ఈ సారి 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పలు లోక్ సభ స్థానాల్లో ఈ ఒపీనియన్ పోల్ ను గతేడాది డిసెంబర్ 15న నిర్వహించారు. మొత్తం 35,801 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ ఏడాది జనవరి 28 వరకు ఈ సర్వేను నిర్వహించారు. రాజకీయ పరిస్థితుల ఆధారంగా చివరి వరకు ఈ ఫలితాలు మారే అవకాశం కూడా ఉందని చెప్పింది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి షాక్ తగలనున్నట్టు సర్వే పేర్కొంది. ఇరు పార్టీల్లో సిట్టింగ్లు ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని వివరించింది. గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకోగా ఈ సారి ఆరు స్థానాలను బీఆర్ఎస్ కోల్పోతుందని స్పష్టం చేసింది.
సర్వే ప్రకారం….. బీజేపీ కూడా గతంలో పోలిస్తే ఈ సారి ఒక స్థానాన్ని కోల్పోనుంది. ఆ పార్టీకి మూడు స్థానాలు వస్తాయి. గతంలో 3 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు ఈ సారి అదనంగా మరో ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓట్ల శాతం పరంగా చూస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 29.8 శాతం ఓట్లు రాగా ఈ ఏడాది 41.2 శాతానికి చేరుకోనుంది.
ఇక అటు ఏపీలో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ దూసుకు పోతుంది. అధికార వైసీపీకి ఏపీ ప్రజలు భారీ షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25 స్థానాల్లో 17 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సీన్ రివర్స్ అవుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాల్లో, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి టీడీపీకి 17 ఎంపీ సీట్లను, వైసీపీ 8 స్థానాలను గెలుచుకోబోతోంది.