Telugu News » India vs China: ‘నేను మీ ఇంటిపేరు మారిస్తే నాదవుతుందా..?’ చైనా కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన భారత్..!

India vs China: ‘నేను మీ ఇంటిపేరు మారిస్తే నాదవుతుందా..?’ చైనా కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన భారత్..!

చైనా చర్యలను భారత్ ఖండించింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు.

by Mano
India vs China: 'Will it be mine if I change your surname?'

భారత్‌(Bharath) సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) విషయంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు 30 కొత్త పేర్లతో లిస్టును తయారు చేసి భారత్ ఓపికను మరోసారి పరీక్షించింది. 30ప్రాంతాలకు సంబంధించిన లిస్టును చైనా పౌర వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేశారంటూ ఆ దేశ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

India vs China: 'Will it be mine if I change your surname?'

ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత్ ఖండించింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు.  ‘నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాదవుతుందా?..’  అని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్‌లో ఒక రాష్ట్రం మాత్రమేనని జైశంకర్ పేర్కొన్నారు. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద తమ సైనం మోహరించి ఉందన్నారు.

ఇదిలా ఉండగా గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో 13,000 అడుగుల ఎత్తైన సేలా టన్నెల్‌ను జాతికి అంకితమిచ్చారు. అప్పటి నుంచి భారత్‌పై చైనా వక్రబుద్దిని ఇలా బయటపెడుతూ వస్తోంది. ఇంతకు ముందు అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాలకు పేర్లు పెడుతూ ఇప్పటి వరకు నాలుగుసార్లు లిస్టులను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రాంతాల పేర్లతో మొదటి లిస్టు, 2021లో 15ప్రాంతాల పేర్లతో రెండోది, 2023లో 11 ప్రాంతాల పేర్లను ప్రకటించింది. ఈసారి(2024) ఏకంగా 30పేర్లతో కూడిన లిస్టును విడుదల చేయడం గమనార్హం.

ఈసారి ఆ లిస్టులో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు మే 1 నుంచి అరుణాచల్‌లోని ఆ 30 ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని, చైనా సార్వభౌమాధికార హక్కులకు క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదని తెలిపింది. వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్‌లోకి అనువదించకూడదని చైనా ఆ లిస్టులో పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పదేపదే చేస్తున్న వాదనలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కొట్టిపారేశారు.

You may also like

Leave a Comment