అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం (Wealthy Family) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మసాచుసెట్స్ (Massachusetts)లోని విలాసవంతమైన భవనంలో దంపతులు, వారి కూతురు విగతజీవులుగా కనిపించినట్టు స్థానిక మీడియా తెలిపింది. భవనంలో రాకేశ్ కమల్ (57), ఆయన భార్య టీనా (54), కూతురు అరియానా( 18) మృత దేహాలు లభించినట్టు నార్ ఫోక్ జిల్లా అటార్నీ మైకేల్ మోరిసే వెల్లడించారు.
గత రెండు మూడు రోజులుగా రాకేశ్ కమల్ కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానంతో ఆయన బంధువు ఒకరు పోలీసులకు కాల్ చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. రాకేశ్ కమల్ మృతదేహం వద్ద ఓ తుపాకీ ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఘటనకు గల కారణాలను ఇప్పుడే చెప్పలేమన్నారు.
వైద్య నివేదికలు వచ్చాక ఇది హత్యనా లేదా ఆత్మహత్యలా అనే విషయం తెలుస్తుందని మైఖేల్ మోరిసే వెల్లడించారు. ఇది ఇలా వుంటే 2016లో రాకేశ్ కమల్ దంపతులు ఎడ్యునోవా ఓ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించారు. ఇందులో ఎడ్యునోవా వెబ్సైట్లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా టీనా కమల్ విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
2021లో ఎడ్యునోవా కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాకేశ్ కమల్ కుటుంబం గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఆ దంపతులు నివసించే 11 పడక గదుల విలాసవంతమైన భవనం విలువ 5 మిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వారి ఆస్తుల్లో కొన్నింటిని జప్తు చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.