అగ్రరాజ్యం అమెరికా(USA)లో మరో భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నెల రోజులుగా అక్కడ చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదువుతున్న సమీర్ కామత్(23) అనే భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
విలియమ్స్ పోర్ట్‌లోని 3300 నార్త్ వారెన్ కౌంటీ రోడ్ 50 వెస్ట్‌లోని క్రోస్ గ్రోవ్ నేచర్ ప్రిజర్వ్ వద్ద సోమవారం సాయంత్రం అతడి మృతదేహం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. సమీర్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. గతేడాది ఆగస్టులో అతడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ ఏడాది పర్డ్యూ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టరల్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు.
అయితే, కామత్ మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. మంగళవారం సమీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సమీర్‌తో కలిపి మొత్తం ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతిచెందడం గమనార్హం.
పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారత సంతతి విద్యార్థి నీల్ ఆచార్య ఇటీవలే నుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. అదేవిధంగా గతవారం ఒహియోలో భారత-అమెరికన్ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి బెనిగేరి, జనవరి 16న అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ, జనవరి 20న అకుల్ ధావన్ అనే 18 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థి ఇల్లినాయిస్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
కాగా, తాజాగా మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన సయ్యద్ మజహిర్ అలీ ఇండియానా వెస్టీయన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని తన ఇంటి సమీపంలో ముగ్గురు దుండగులు అలీపై దాడి చేశారు. దీనికి సంబంధించి సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు వైరల్‌గా మారాయి.