ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(Vijayawada)లోని ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై దేవీ శరన్నవరాత్రోత్సవాలు (Devi sharannavaratrotsavalu) ముగియనున్నాయి. దసరా(dussehra) పండుగను పురస్కరించుకొని ఇవాళ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల చివరి రోజు దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రెండు రూపాల్లో అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని, అనుకున్న కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ అరుదైన అవకాశం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజామున 3గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మహార్నవమి గడియల్లో అమ్మవారు మహిషాసురమర్దనిగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాజరాజేశ్వరీదేవీగా రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివవ్వనున్నారు.
అదేవిధంగా మధ్యాహ్నం నుంచి దశమి గడియల్లో అంటే విజయదశమికి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
కనకదుర్గ ఆలయానికి భవానీ మాలధారులు క్యూకడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి మాలధారణలో ఉండి నిష్టగా పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు భవానీ మాలధారులు పెద్దసంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.