రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిపాలని భావించిన బీఆర్ఎస్ (BRS)కు అసెంబ్లీ ఎన్నికలు చెక్ పెట్టాయనే టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు మూడోసారి వరుసగా ఒకే పార్టీ అధికారాన్ని సొంతం చేసుకొన్న సందర్భాలు లేవు.. ఈ క్రమంలో ఆ లోటు బీఆర్ఎస్ పూడ్చాలని భావించింది. అయితే ఓటర్లు మాత్రం సున్నితంగా తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ ఓటమిపై నేతలు పలురకాలుగా మాట్లాడుకోవడం తెలిసిందే..
ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari).. కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ (Congress)లో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తానే రెండో స్థానం అంటున్నారని ఆరోపణలు చేశారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం పదవి రాలేదని, ఆయన భార్య వాపోతున్నట్టు వెల్లడించారు..
బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు.. మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. కేటీఆర్ (KTR).. హరీష్ రావు (Harish Rao).. కృష్ణార్జునుల మాదిరిగా కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా అడుగులు వేయాలని సూచించారు..
రేవంత్ సర్కార్ దళితబంధు పథకాన్ని ఆపటం సరికాదని.. ఇప్పటికైనా లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేయాలని కడియం సూచించారు. మరోవైపు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ (TRS)ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందన్నారు. అందువల్ల ఓట్ల శాతాన్ని కోల్పోయినట్టు పార్టీ శ్రేణుల అభిప్రాయమని తెలిపిన కడియం.. ఈ విషయాన్ని వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ముందుంచిన విషయం తెలిసిందే..