దేశ సాయుధ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడకపోవడం కాంగ్రెస్ (Congress) చేసిన అతిపెద్ద పాపమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. భారత భద్రతకు, సైనిక బలగాలను నష్టం చేకూర్చేందుకు దొరికిన ఏ అవకాశాన్ని ఆ పార్టీ వదులుకోలేదంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్‌లోని ఓ వర్గం మోడీని విమర్శించడం, తిట్టడమే పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ….ఎన్డీఏ వాగ్దానం చేస్తున్న వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) గురించి కూడా ఇండియా కూటమి నేతలు ప్రస్తావించలేరని అన్నారు. ఐదేండ్ల క్రితం మన వైమానిక దళానికి రాఫెల్ జెట్ రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపణలు చేశారు.
మన భద్రతా బలగాలు చేసిన సర్జికల్ స్ట్రైక్ పై ప్రశ్నలు సంధించారని ఫైర్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రూఫ్ కావాలని కాంగ్రెస్ నేతలు అడిగారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఓ వర్గం తనపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. మోడీ సర్కార్ మరోసారి విజయం సాధిస్తుందని విదేశాలకు కూడా తెలుసునని తెలిపారు. ఎన్నికలు ఇప్పటికీ ఇంకా జరగలేదన్నారు.
కానీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో పలు కార్యక్రమాలకు హాజరు కావాలని తనకు విదేశాల నుంచి ఇప్పటకే ఆహ్వానాలు అందాయని చెప్పారు. ఈ ఆహ్వానాలు ఏమి సూచిస్తాయి? అన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు బీజేపీ ప్రభుత్వం పునరాగమనంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాయని పేర్కొన్నారు. మోడీ మరోసారి విజయం సాధిస్తారని వారికి కూడా తెలుసన్నారు.
తాను అధికారాన్ని ఆస్వాదించేందుకు మూడవ సారి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. దేశం కోసం పనిచేయాలని తాను అనుకుంటున్నానని చెప్పారు. తాను తన ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మందికి ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదన్నారు. ఎన్డీఏ 400లకు పైగా సీట్లు గెలుస్తుందన్నారు.