సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014 ఐపీఎల్(IPL) ప్రథమార్థం యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడూ బీసీసీఐ అదే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(Indian Premier League 2024) ద్వితీయార్థం యూఏఈ(UAE)లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పదు.
సార్వత్రిక ఎన్నికలతో ఐపీఎల్ మ్యాచ్‌ల తేదీలు క్లాష్ అయ్యే అవకాశం ఉన్నందున టోర్నీ యూఏఈకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే బీసీసీఐ ఉన్నతాధికారులు దుబాయికి వెళ్లారని, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 21 మ్యాచ్‌లతో కూడిన ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ షెడ్యూల్లో చివరి మ్యాచ్ ఏప్రిల్ 7న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది.
మార్చి 22న చెన్నెలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. భారత ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను దుబాయికి తరలించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది బీసీసీఐ ఉన్నతాధికారులు దుబాయ్‌లో ఉన్నారు.
‘ఐపీఎల్ ద్వితీయార్ధం దుబాయ్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి’ అని బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి. వీసాల కోసం ప్లేయర్స్ తమ పాస్‌పోర్ట్‌లను ఇవ్వాలని కొన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి సమయంలోనూ రెండేళ్లు యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్థాలలో గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.