– కాంగ్రెస్ గెలుపునకు కారణాలేంటి?
– గ్యారెంటీలు గట్టిగా పని చేశాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చింది ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలే. కాంగ్రెస్ కి సంపూర్ణ మెజార్టీ ఇస్తూ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు.. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను కూడా తెలియచేసింది. అయితే.. కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండేది. అక్కడి ఫలితాలు ఇక్కడ ఊపిరిని అందించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు కారణాలను వెతికితే.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజల్లోకి తమ మేనిఫెస్టోని తీసుకువెళ్లడంలో పార్టీ కృషి ఫలించిందని అంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఆరు గ్యారెంటీలను తయారు చేశారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. రైతుల సంక్షేమం కోసం కౌలు రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేలు.. కళ్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఈ పథకాలన్నీ పేద, మధ్యతరగతి ప్రజలకు బాగా చేరువయ్యాయనే టాక్ ఎక్కువగా వినపడుతోంది. మరోవైపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం.. చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా.. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని తెలిపింది.
చేయూత కింద నెలకు రూ.4వేల పింఛను.. భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు.. వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 బోనస్ మొదలగు పథకాలు కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయని అంటున్నారు. అదీగాక బీఆర్ఎస్ తీరుపై వ్యతిరేకత కూడా హస్తం గెలుపునకు ఒక కారణంగా చెబుతున్నారు.