గాజా (Gaza) సిటీపై ఇజ్రాయెల్ (Israeli) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. మరోవైపు శనివారం రఫా (Rafha) నగరంపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడగా.. ఈ దాడుల్లో హమాస్ (Hamas) అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే మృతి చెందిన విషయం తెలిసిందే..
ఇప్పటికే రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షాన్ని కురిపించగా.. కనీసం 44 మంది పాలస్తీనా (Palestinians) వాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నట్లు అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు చేయడం గమనార్హం. అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడులను పలు దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఇప్పటికే సౌదీ అరేబియా హెచ్చరించింది.
మరోవైపు తాజాగా దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇద్దరు బందీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 63 మంది (63 Killed) పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని రఫా ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు, యుద్ధంలో తొలిసారిగా హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిలో ఇద్దరిని ఇజ్రాయెల్ సైన్యం కాపాడింది.
నేటి తెల్లవారు జామున రఫా నగరంలో అర్ధరాత్రి చేపట్టిన ఆపరేషన్‌లో వారిని రక్షించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా రఫాలో ఐడీఎఫ్, ఐఎస్‌ఏ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఫెర్నాండో సిమోన్ మార్మన్, లూయీస్ హర్ ను హమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ సైన్యం కాపాడింది. వీరిని గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు నిర్ యిత్జక్ కిబుట్జ్ నుంచి కిడ్నాప్ చేశారని సైన్యం ప్రకటించింది.
మరోవైపు గాజాలో దాడుల తరువాత సుమారు 1.4 మిలియన్ల మంది రఫాలో నివసిస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు.. కాగా రఫా ప్రాంతంలోని అమాయక ప్రజలను ఇజ్రాయెల్ చంపేస్తుందని హమాస్ ఆరోపించింది. ఈ దాడుల నేపథ్యంలో గాజా ప్రజలు ఈజిప్టుకు వెళ్లే విషయంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. పాలస్తీనియన్లు తమ దేశంలోకి ప్రవేశించడం ఈజిప్టుకు ఇష్టం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి..