హమాస్(Hamas) కీలక నేత సలేహ్ అరౌరీ(Saleh Arouri) హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ చర్చలను ఆ సంస్థ నిలిపివేసింది. ఈ హత్య ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. హెజ్బొల్లా గ్రూప్ సైతం ఇజ్రాయెల్(Israel)కు హెచ్చరికలు పంపింది. తాము యుద్ధానికి భయపడమని తేల్చిచెప్పింది.
ఈ దాడికి ముందు హమాస్, ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అరౌరీ మరణం ఒక రకంగా ఇరాన్‌కు ఇబ్బందికరమే. 2015లో అరౌరీని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి సమాచారం అందిస్తే 5 మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తామని వెల్లడించింది. బీరుట్లో అరౌరీపై డ్రోన్ దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచింది. తన మిత్రదేశమైన అమెరికాతోనూ ముందుగా పంచుకోలేదు.
దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ పెదవి విప్పనప్పటికీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. హమాస్ అగ్ర నేత హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. హెజ్బొల్లా సంస్థ సైతం ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు పంపింది. యుద్ధానికి తాము భయపడమని చెప్పుకొచ్చింది.
తాము యుద్ధంలోకి దిగితే రూల్స్ ఏవీ ఉండవని హెజ్బొల్లా నేత సయ్యద్ హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. అరౌరీ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందని తెలిపారు. ఇరాన్ మాజీ సైనిక జనరల్ ఖాసిం సులేమానీ నాలుగో వర్ధంతి సందర్భంగా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. యుద్ధంలో ఇజ్రాయెల్ గెలవలేదని, లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే తమకు రూల్స్ ఉండవని హెచ్చరించారు.
మరోవైపు, హమాస్ నేతలను వదిలేది లేదని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7న దాడికి కారణమైన ప్రతి ఒక్క నేతనూ వేటాడతామని మొస్సాద్ అధిపతి డేవిడ్ బర్నియా తేల్చి చెప్పారు. హమాస్ నేతలు ప్రపంచంలో ఎక్కడున్నా అంతమొందిస్తామని హెచ్చరించింది.