ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం(Israel-Hamas War) కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ విమానాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్(Gaza Strip)పై నిరంతరం బాంబు దాడులకు తెగబడుతున్నాయి. 71రోజులుగా ఈ మారణహోమం కొనసాగుతోంది. తాజాగా, హమాస్ చేతిలో ఉన్న ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున చంపడం కలకలం రేపింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇది విషాదకర ఘటన అని వ్యాఖ్యానించారు.
ఆగ్రహించిన ప్రజలు టెల్ అవీవ్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రదర్శనలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాకు అందించిన సాయం తమ భూభాగం గుండా వెళుతుందని తెలిపింది. గాజాలో దక్కా హైఫా స్కూల్‌లో చిక్కుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా కెమెరామెన్ సమీర్ అబు దబ్బా మృతిచెందారు. గాజాలో 36 ఆసుపత్రులు ఉన్నాయి, వాటిలో 11 మాత్రమే కొంత మేరకు పనిచేస్తున్నాయి. 50 వేల మందికి పైగా క్షతగాత్రులు ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ గాజాలోని 22 వేలకు పైగా లక్ష్యాలపై బాంబు దాడి చేసింది. దీని కారణంగా 19 లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఇది గాజా జనాభాలో 85 శాతం. నిరాశ్రయులైన ప్రజలు చలి, వర్షం వంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా కనీసం 18,700 మంది పాలస్తీనియన్లు గాజాలో మరణించారు. దాదాపు 51000మంది గాయాలపాలయ్యారు.
మరోవైపు మానవతా సహాయంతో కూడిన 106 ట్రక్కుల కాన్వాయ్ శుక్రవారం రఫా క్రాసింగ్ గుండా గాజాకు చేరుకుందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. ఇందులో ఐదు ట్రక్కులు ఇంధనాన్ని తీసుకెళ్తున్నాయి. 441 మంది విదేశీయులు, నలుగురు గాయపడిన పాలస్తీనియన్లతో సహా మొత్తం 445 మంది గాజా స్ట్రిప్ నుంచి బయలుదేరారు.
అమెరికా ఎన్ఎస్ఏ జాక్ సుల్లివన్ పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడుతూ ఈ సమయంలో గాజాలో ప్రజలకు పంపిన మానవతా సహాయాన్ని పెంచడంపై చర్చించినట్లు తెలిపారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల కోసం రెండు దేశాల పరిష్కారానికి యూరోపియన్ యూనియన్ మద్దతు ఇస్తుందని అన్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరనంత వరకు శాంతిభద్రతలు ఉండవని అంటున్నారు.