ఇరాన్(Iran) అనుకున్నంత పనే చేసింది. ఇజ్రాయెల్(Israel)పై దాడులను మొదలుపెట్టింది. శనివారం అర్ధరాత్రి దాదాపు రెండు వందలకు పైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్లో డ్రోన్ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్లు సమాచారం.
ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ఇజ్రాయెల్ రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని నెతన్యాహూ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను ఆమెరికా మోహరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇజ్రాయెల్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, దాడి ఆలోచనలను ఇరాన్ పక్కన పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే.
దాడులకు దిగితే ఊరుకోమని ఇరాన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ వినిపించుకోలేదు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ పై డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. మరోవైపు ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రకటించారు.
ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి రాగానే సైరన్ శబ్దంతో భీకర వాతారణం నెలకొంది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ విమానాలను రద్దు చేశాయి. ఈ క్రమంలో తమ వైమానిక దళాలను అలర్ట్ చేశాయి.
ఈనెల ప్రారంభంలోనే సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్జేసీకి చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు మృతిచెందారు. దాడికి ఇజ్రాయెలే కారణమని ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అంతా అనుకున్నట్లుగానే ఇరాన్ డ్రోన్లతో దాడులు మొదలుపెట్టడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.