Isro : చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో ఇక సూర్యుడిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 2 న ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేయనున్నట్టు ప్రకటించింది . ఇది సిద్ధమైందని, అహ్మదాబాద్ లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ వెల్లడించారు. ఏపీ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆ రోజున ఆదిత్య ఎల్-1 ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకుపోతుందన్నారు.
సౌర వ్యవస్థలోని సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో నడుం కట్టిన నేపథ్యంలో ఆదిత్య ఎల్-1 ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం లోని లాంగ్రేజ్ పాయింట్-1 వద్దఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్య లోకి చేరుస్తారని ఆయన వివరించారు. దాదాపు 127 రోజుల ప్రయాణం తరువాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. శతాబ్దాల తరబడి సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు సైంటిస్టులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మేము కూడా ఇందుకు సిద్దమన్నట్టు ఇస్రో సైతం రంగంలోకి అడుగు పెట్టింది.
అయితే ఇస్రో ప్రయోగించే స్పేస్ క్రాఫ్ట్ లో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ అనే ప్రత్యేక వ్యవస్ధను వినియోగించడం విశేషం. సూరీడుకి అధిక కాంతినిచ్చే కాంతిపుంజాన్ని అధ్యయనం చేయడానికి, సూర్యుని స్పెక్ట్రోస్కోపీ ఇమేజీని తీసి మరింత లోతుగా విశ్లేషించడానికి దీన్ని వినియోగిస్తారు. ఇందులోని నాలుగు పే లోడ్లు నేరుగా సూర్యుడిపై పరిశోధనలు చేస్తాయి.
మిగతా మూడు ఎల్-1 పాయింట్ వద్ద వాతంవరణంపై స్టడీ చేస్తాయి. ఇంకా ఇవి ఇన్ ఫ్రారెడ్ కిరణాలు, ఫోటొస్ఫియర్, సోలార్ ఎమిషన్, సౌర గాలులు, ఉష్ణం, కొరోనల్ మాస్ ఎజెక్షన్ పై కూడా ఇవి అధ్యయనం చేయనున్నాయి. భూమిపై తరచూ అలజడులకు కారణమయ్యే సోలార్ విండ్స్ నే ‘అరోరా’ అని వ్యవహరిస్తున్నారు. సూర్యునిపైని వాతావరణాన్ని స్టడీ చేయాలంటే ఆదిత్య ఎల్-1 సుమారు నాలుగు నెలల పాటు 15 లక్షల కి.మీ. ప్రయాణించవలసి ఉంటుందని, బ్యాలెన్సింగ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ కారణంగా వ్యోమనౌకలోని ఇంధన వినియోగం తగ్గుతుందని ఇస్రో వర్గాలు వివరించాయి.