అంతరిక్ష రంగంలో భారత్ (India) మరో మైలు రాయిని చేరుకుంది. ఇస్రో చేపట్టిన మొట్ట మొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 ( Aditya L-1) సక్సెస్ అయింది. సుమారు 126 రోజులు ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 వ్యోమ నౌక తన లక్ష్యాన్ని చేరుకుంది. లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో స్పేస్ క్రాఫ్ట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇస్రో ప్రవేశ పెట్టింది.
ఆదిత్య ఎల్-1 స్పేస్ క్రాఫ్ట్ ఈ నెల 6న 4 గంటలకు లాగ్రాంజ్ పాయింట్ ను చేరుకోబోతోందని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ గత సోమవారం వెల్లడించారు. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు గతేడాది ఆదిత్య ఎల్-1 మిషన్ ను చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను పీఎస్ఎల్వీసీ-57 వ్యోమనౌక ద్వారా ఇస్రో ప్రయోగించింది.
ఆ తర్వాత పలు మార్లు కక్ష్య పెంపు ప్రక్రియలను విజయవంతంగా చేపట్టింది. సూర్యుడి దిశగా ఆదిత్య ఎల్-1 ప్రయాణం కొనసాగించి 4నెలల తర్వాత లాగ్రాంజ్ పాయింట్‌కు చేరింది. ఈ లాగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రదేశంలో ఉంటే సూర్యున్ని ప్రతీ క్షణం పరిశీలించేందుకు అవకావం కలుగుతుందని ఇస్రో గతంలో తెలిపింది.
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం కావడంపై ప్రధాని మోడీ స్పందించారు. భారత్ మరో మైలురాయిని చేరుకుందని వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు. అత్యంత సంక్లిష్టమైన, సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇదొక నిదర్శనమన్నారు. ఈ అసాధారణ విజయాన్ని దేశంతో కలిసి తాను కూడా ప్రశంసిస్తున్నానని వెల్లడించారు.