తెలంగాణ (Telangana)లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయం (Elections Time) దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్(BRS) నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అనుచరులు, బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపాయి.
ఉదయం 4 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 40 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో నల్గొండలో 30 బృందాలు సోదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్ రావు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు శ్రీధర్, ఆయన కుమారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భాస్కర్‌రావుకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. పలు పవర్ ప్లాంట్లలో భాస్కర్ రావు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యా భాస్కర్‌రావు భారీగా డబ్బులు నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లలో ఈనెల 13న మొదలైన ఐటీ సోదాలు 16వ తేదీ(బుధవారం) ముగిశాయి. అనుచరులు నరేందర్‌రెడ్డి ఇంట్లో రూ.7.50కోట్లు, ప్రదీప్‌రెడ్డి ఇంట్లో రూ.5కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. కొన్ని వారాల క్రితం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది.