– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీలు
– రూ.20 లక్షల నగదు స్వాధీనం
– ఎమ్మెల్యే తమ్ముడి ఇంట్లోనూ సోదాలు
– రూ.24 లక్షల నగదు గుర్తింపు
– పలు రికార్డుల స్వాధీనం
– పాతబస్తీ వ్యాపారస్తుల ఇళ్లలోనూ తనిఖీలు
దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ (Congress) నేతలే కనిపిస్తున్నారా? గులాబీ నేతలు ఎంత అవినీతి చేసినా, విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నా కనిపించడం లేదా? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) విమర్శలు చేసిన కొన్ని గంటల్లో ఐటీ (IT) అలర్ట్ అయింది. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) ఇంట్లో సోదాలకు దిగింది. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరులోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు తనిఖీలు చేపట్టారు.
తాండూరుతోపాటు హైదరాబాద్ (Hyderabad) మణికొండలోని రోహిత్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు జరిగాయి. రూ.20 లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే, ఎమ్మెల్యే తమ్ముడు రితీష్ రెడ్డి ఇంటిలో రూ. 24 లక్షలతో పాటుగా పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 5 చోట్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
మరోవైపు, పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా కూడా ఐటీ దాడులు జరిగాయి. కింగ్స్ ప్యాలెస్ (Kings Palace) యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ (Kohinoor Group) ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. షానవాజ్ ఇంటితోపాటు పలువురి ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఐటీ అధికారులు రెయిడ్స్ చేసిన్నట్లు సమాచారం.
ఈ ఏడాది మే నెలలో కూడా కోహినూర్ గ్రూప్ ఎండీ ఇండ్లు, కార్యాలయాలతోపాటు గ్రూప్ లోని పలు హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓల్డ్‌సిటీతో పాటు చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ గ్రూప్ నకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. ఇటు, తాండూరులో శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్ పై ఐటీ సోదాలు జరిపారు ఐటీ అధికారులు. హోటల్ యజమాని శేఖర్ గౌడ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. అతని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు అందుతున్నాయనే ఆరోపణలతో ఈ రెయిడ్స్ నిర్వహించిట్లుగా ప్రచారం జరుగుతోంది.