తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ (Congress) అధికార పీఠం కైవసం చేసుకోంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పెద్ద మెజార్టీ కట్టబెట్టలేదు.. ఓ వైపు కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కుతుండగానే బీఆర్ఎస్ (BRS) నేతలు కొద్ది మంది చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమనే నేతల కామెంట్స్ కాకతాళీయంగా చేసినవేవీ కాదని అర్థమవుతోంది. ఐదేళ్ల పాటు 64 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సామే అని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై (Parliament Elections) దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్ సభలోనూ రిపీట్ చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పీఏసీ సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ చార్జీలను నియమించింది.. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన రేపువిస్తృత కార్యవర్గ సమావేశం భేటీ కాబోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీనే సార్వత్రిక ఎన్నికల్లో వాడుకుని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది.
తెలంగాణలో 15 లోక్ సభ స్థానాలలో గెలవడమే టార్గెట్ గా ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీలను గెలుచుకున్న హస్తం.. లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీ హోదాలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా సంస్థాగత మార్పులకు సైతం శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కొత్త పీసీసీకే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలకు అధిష్టానం ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త పీసీసీకి సంబంధించిన కీలక సూచనలు చేరినట్లు సమాచారం. దీంతో రేపటి సమావేశంలో పీసీసీ ఎంపికపై నేతల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నామినేటెజ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భట్టి హస్తినా టూర్ పై పార్టీవర్గాల్లో చర్చమొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ అయి రాగా, తాజాగా డిప్యూటీ సీఎం వెళ్లడంతో రేపటి భేటీలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠ పార్టీ వర్గాలలో నెలకొంది. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను, రాజకీయ వ్యూహాలను బయటకు తీయడం ఖాయమని తెలుస్తోంది.