ప్రజా సేవకులు అంటే రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి.. కానీ నేటి నేతలు అధ్వానంగా తయారు అవుతున్నారని అనుకొంటున్నారు.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ విలువలు మరింత దిగజారి పోయాయని.. నేతల మధ్య మాటల యుద్ధం.. బూతులు తిట్టుకొనే వరకు వెళ్ళిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. విలువలేని పదాలకు కేసీఆర్ పునాది వేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ నేతలతో పాటు.. గులాబీ నేతలు సైతం ఇదే దారిలో వెళ్తున్నారంటున్నారు.
ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలందరు పనులు కాస్త పక్కనపెట్టి.. ప్రచారంలో నిమగ్నం అయ్యారు.. ఈ క్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy), సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై నిప్పులు చెరిగారు. తనపై నిన్న చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయన్నారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అని మండిపడ్డారు.. సీఎం హోదాలో ఆయన మాట్లాడిన తీరు బాధాకరమని పేర్కొన్నారు.
నల్లగొండ (Nallagonda) జిల్లాలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. రేవంత్ మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చవలసిన అవసరం లేదన్న ఆయన.. వాళ్ళ నేతలే సీఎం పదవికి ఎసరు పెడతారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ 160 రోజుల పాలనలో నీటి కరువు వచ్చింది, లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని ఆరోపించారు.
మరోవైపు మోడీ (Modi)కి రేవంత్ తెలంగాణ నుంచి డబ్బు మూటలు పంపిస్తున్నారని ఆరోపించిన జగదీశ్ రెడ్డి.. ప్రధాని సీఎం పీఠాన్ని కాపాడుతారనే భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్‌ను రేవంత్ పొగుడుతుంటే ప్రజలే కాదు కాంగ్రెస్ నేతలు సైతం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కాలం చెల్లిన నోటని.. త్వరలో బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయని అన్నారు..