బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ కేసులు, లీకులు తప్పా కాంగ్రెస్ (Congress) పార్టీకి పాలన చేతకాదని ఎద్దేవా చేశారు. ఆదివారం మిర్యాలగూడలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వైపు నీళ్లులేక పంట పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. లగడపాటి రాజగోపాల్ నాఫోన్‌ను ట్యాప్ చేశారని ఆరోపించారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. ఏనాడు పోలీసులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదని గుర్తు చేశారు. ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్‌లో కూడా నీళ్లు ఇచ్చిన విషయాన్ని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు సాగర్‌లో నీళ్లు ఉన్నా ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెప్పిన హామీలపై నిలదీయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.