తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలపై.. బీఆర్ఎస్ (BRS) నాయకులు ఒక్కొక్కరు విరుచుకు పడుతున్నారు.. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy).. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక అయోమయంలో పడుతున్నారని విమర్శించారు.
అధికారంలోకి రావాలనే ఆలోచనతో అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుతం ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ అప్లికేషన్లు లేకుండా లబ్దిదారులను ఎంపిక చేశామని జగదీశ్ రెడ్డి వివరించారు.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళారి వ్యవస్థ లేకుండా ఆన్‌లైన్ విధానం పెట్టామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.. కౌలు రైతులను పాసు పుస్తకం నంబర్లు అడుగుతున్నారని వెల్లడించారు. ఈ తతంగాన్ని అంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపిన జగదీశ్ రెడ్డి.. ప్రజలు పథకాలు అడుగుతున్నారని, పత్రాలు కాదని.. కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆడుతోన్న పత్రాల డ్రామాలు ఎక్కువకాలం రాష్ట్రంలో సాగవని జగదీశ్ రెడ్డి తెలిపారు.. ఇప్పుడిప్పుడే మీ మోసాలు తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.. హామీలు అమలు చేయలేకపోతే ప్రజలు వెంటపడి తరుముతారని హెచ్చరించారు. మాటల్లో కాదని చేతల్లో మీ పనితనం చూపించాలని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు..